నా భావాలు మీతో పంచుకోవాలనే ఈ చిన్ని ప్రయత్నం

నా భావాలు మీతో పంచుకోవాలనే ఈ చిన్ని ప్రయత్నం

Sunday, 17 April 2011

చార్మినార్ సాక్షిగా...

 


హైదరాబాద్ అనగానే మనకు గుర్తొచ్చేది వందల ఏళ్ళ చరిత్రగల చార్మినార్, దాని పక్కనున్న  మక్కామసీద్, చుడీబజార్.  ఇవి మాత్రమే కాదు ఇంకాస్త లోతుగా పరిశీలిస్తే... " లేలోసాబ్ లేలోసాబ్ "అంటూ మీ వెంటబడే ఎంతో మంది చిన్నారులు మీ మదిలో మెదులుతారు.

బాల కార్మిక వ్యవవస్థ నిర్మూలనకు ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తోంది. బడి ఈడు పిల్లల్ని బడికి పంపించాలనేది ప్రభుత్వ లక్ష్యం. అయితే అధికారుల నిర్లక్ష్యం...  వీరి బాల్యాన్ని చిదిమేస్తోంది. ఇక్కడ కనిపిస్తున్న వీరంతా బడి ఈడు పిల్లలు. పేదరికం వారిచేత  చదువు మాన్పించింది. హాయిగా బడికెళ్ళి చదువుకుంటూ సరదాగా గడపాల్సిన వయసులో ఎండలో వివిధ రకాల వస్తువులు అమ్ముతూ కష్టపడుతున్నారు. తోపుడు బండ్లు నెట్టుకుంటూ బ్రతుకుబండి ని లాగుతున్నారు.

 కుటుంబపోషణ కోసం కష్టపడుతున్న వీరికి ఆయా షాపు యజమానులే సరుకు సప్లై చేస్తుంటారు. ఉదయాన్నే రావడం షాపునుంచి సరుకుతీసుకోవడం... సాయంత్రం వరకు అమ్మగా మిగిలిన సరుకును యజమానికి ఇచ్చి కమీషన్ డబ్బుతో ఆనందంగా ఇంటికెళ్ళడం ఇదీ వీరి దినచర్య. కొంతమంది వీరికి ఫైనాన్స్ కూడా ఇచ్చి ప్రోత్సహిస్తుంటారు.

చిట్టి పొట్టి  చేతులతో పుస్తకాల బ్యాగ్‌లు మోసుకెళ్ళాల్సిన వయసులో గాజులు, బట్టలు, ఆట వస్తువులు, తమలపాకులు ఇలా రకరకాల వస్తువులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు.

చార్మినార్ ను చూసి ఆనందంగా తిరిగి వెళ్ళే వారికి ఇక్కడి బాలకార్మికులను చూసి జాలి వేయకమానదు. ప్రభుత్వం స్పందించి ఈ చిన్నారులను బడిలో చేర్పించి వారి విలువైన భవిష్యత్ ను నిలబెట్టాలని స్థానికులు కోరుతున్నారు.

తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెందరో అన్నట్టు అద్భుతమైన చారిత్రక కట్టడంగా అలరారుతున్న చార్మినార్.. మాటున నగలిపోతున్న చిట్టి బతుకుల గురించి కూడా పట్టించుకుందాం. వారికి ఉజ్వలమైన భవిష్యత్తు ఇవ్వడానికి మనవంతు కృషి చేద్దాం.

No comments:

Post a Comment