నా భావాలు మీతో పంచుకోవాలనే ఈ చిన్ని ప్రయత్నం

నా భావాలు మీతో పంచుకోవాలనే ఈ చిన్ని ప్రయత్నం

Tuesday, 3 May 2011

బతుకే సర్కస్...



స్ప్రింగ్ లాంటి ఒళ్ళు గాలిలో మైమరపించే ఫీట్లు, అబ్బురపరిచే విన్యాసాలు, కళ్ళు తిప్పుకోనివ్వని ప్రదర్శన, విన్యాసాలు చూసిన వారెవరైనా....  ప్రశంసించకుండా ఉండలేని నైపుణ్యం వారి సొంతం. అదే సర్కస్....

సర్కస్... ఈ మాట వినగానే పెద్దవాళ్లు కూడా చిన్నపిల్లలవుతారు. ఒక్కసారిగా చిన్ననాటి సంగతులు గుర్తుకొస్తాయి. సర్కస్‌లో పులులు, సింహాలు, ఏనుగులు, కోతులు, ఎలుగుబంట్లు చేసే వినోదం మన కళ్లముందు కదలాడుతుంది. ఆ సంగతులన్నీ అప్పుడప్పుడు మన పిల్లలతోనూ పంచుకుంటాం.  అలాంటి సర్కస్‌ మన ఊరికో... నగరానికో వస్తే సర్కస్‌ను చూపించడం కోసం ఎంతో ఉబలాటపడతాం.

అప్పటికి ఇంతగా సామాజిక స్పృహ లేకపోవడంతో సర్కస్‌లలో జంతువులను విరివిగా ఉపయోగించేవారు. అప్పటి సర్కస్‌కు ఇప్పటి సర్కస్‌‌కు చాల వ్యత్యాసం ఉంది. అప్పడు సర్కస్‌ అంటే కేవలం జంతువుతో వివిధ రకాల విన్యాసాలు చేయించే వారు. వాటిని చూసిన ప్రేక్షకులు ఉబ్బితబ్బిబ్బయ్యేవారు. అయితే ఇదంతా గతం. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.

సర్కస్‌లలో జంతువుల వినియోగంపై జంతు సంరక్షణ సంఘాలు ఆందోళనలు నిర్వహించడంతో....
కొన్నేళ్ళుగా సర్కస్‌లలో మూగజీవాలను నిషేధించారు. దీంతో సర్కస్ కళ తప్పింది. ప్రేక్షకుల ఆదరణా కొరవడింది. దేశ వ్యాప్తంగా సుమారు 100కు పైగా ఉన్న సర్కస్ కంపెనీలు ప్రస్తుతం 20కి పడిపోయాయి.  సర్కస్‌కు పూర్వ వైభవం తెచ్చేందుకు సర్కస్‌ కంపెనీలు కొత్త మార్గాలను అన్వేషించాయి.
విదేశీ కళాకారులను రప్పించి సందర్శకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే తాజాగా సుప్రీంకోర్టు 14 ఏళ్ళ పిల్లలను కూడా నిషేదించడంతో అతి తక్కువ కాలంలోనే ఈ కళ కనుమరుగయ్యే అవకాశాలున్నాయని నిర్వహకులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు సర్కస్‌లో పనిచేసే కళాకారులను ప్రభుత్వం గుర్తించడం లేదని కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రదర్శనల నిమిత్తం దేశం మొత్తం తిరుగుతుండటంతో తమకు స్థిరమైన నివాసం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొట్టచేతబట్టుకొని దేశాలు తిరిగేతాము కనీసం కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు కూడా వీలు లేకుండా పోతోందని కళాకారులంటున్నారు. ఎందుకంటే వీరికి సరైన నివాస దృవ పత్రాలు లేక కనీసం సెల్‌ఫోన్‌ సిమ్ కార్డు కూడా కొనుక్కోలేని పరిస్థితి.

తరతరాలుగా కొంతమంది గారడీ విద్యలు ప్రదర్శిస్తూ పొట్టపోసుకోవడం తెలిసిందే... ఇలాంటి కళలను ప్రభుత్వాలు ఆదరించకపోవడం. వంశపారపర్యంగా ఇదే వృత్తిని కొనసాగించడం లాంటి కారణాలతో ముఖ్యంగా పిల్లలు చిన్న వయసులోనే సర్కస్‌లో భాగమైపోతున్నారు.


దీంతో పిల్లల హక్కులను కాపాడాలంటూ బచ్‌పన్ బచావో ఆందోళన్ అనే స్వచ్ఛంద సంస్ధ దాఖలు చేసిన పిటిషన్ మేరకు సర్కస్ కంపెనీల్లో చిన్నారులచేత విన్యాసాలు చేయించండంపై సుప్రీంకోర్టు నిషేధం విదించింది. సర్కస్ లో పనిచేస్తున్న పిల్లలను రక్షించి వారికి పునరావాసం కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాలబాలికల ప్రాథమిక హక్కులను కాపాడాలని తన తీర్పులో పేర్కొంది. సర్కస్‌ కంపెనీల్లో చిన్నారుల నియామకంపై నిషేదం విధిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మరోవైపు నిర్వహకులు మాత్రం చిన్న వయసులోనే పిల్లలకు సర్కస్ విన్యాసాలు నేర్పించడం సాధ్యమవుతుందని అంటున్నారు. సర్కస్‌ విన్యాసాల్లో నైపుణ్యం సాధించేందుకు 9 ఏళ్ళ వయసు సరియైనదని అంటున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దృష్ట్యా 14 సంవత్సరాలు నిండిన పిల్లలకు శిక్షణనివ్వడం కుదరదని నిర్వహకులు అంటున్నారు.

పిల్లలు చదువుతోపాటు, విన్యాసాలు నేర్చుకునేందుకు వీలుగా జిమ్నాస్టిక్‌ శిక్షణా కేంద్రాలను  ఏర్పాటు చేయాలని కళాకారులు కోరుతున్నారు. అయితే తాజ తీర్పుతో సర్కస్‌లలో పనిచేస్తున్న పిల్లలు బడిబాట పడతారని ఆశిద్దాం...


Sunday, 17 April 2011

చార్మినార్ సాక్షిగా...

 


హైదరాబాద్ అనగానే మనకు గుర్తొచ్చేది వందల ఏళ్ళ చరిత్రగల చార్మినార్, దాని పక్కనున్న  మక్కామసీద్, చుడీబజార్.  ఇవి మాత్రమే కాదు ఇంకాస్త లోతుగా పరిశీలిస్తే... " లేలోసాబ్ లేలోసాబ్ "అంటూ మీ వెంటబడే ఎంతో మంది చిన్నారులు మీ మదిలో మెదులుతారు.

బాల కార్మిక వ్యవవస్థ నిర్మూలనకు ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తోంది. బడి ఈడు పిల్లల్ని బడికి పంపించాలనేది ప్రభుత్వ లక్ష్యం. అయితే అధికారుల నిర్లక్ష్యం...  వీరి బాల్యాన్ని చిదిమేస్తోంది. ఇక్కడ కనిపిస్తున్న వీరంతా బడి ఈడు పిల్లలు. పేదరికం వారిచేత  చదువు మాన్పించింది. హాయిగా బడికెళ్ళి చదువుకుంటూ సరదాగా గడపాల్సిన వయసులో ఎండలో వివిధ రకాల వస్తువులు అమ్ముతూ కష్టపడుతున్నారు. తోపుడు బండ్లు నెట్టుకుంటూ బ్రతుకుబండి ని లాగుతున్నారు.

 కుటుంబపోషణ కోసం కష్టపడుతున్న వీరికి ఆయా షాపు యజమానులే సరుకు సప్లై చేస్తుంటారు. ఉదయాన్నే రావడం షాపునుంచి సరుకుతీసుకోవడం... సాయంత్రం వరకు అమ్మగా మిగిలిన సరుకును యజమానికి ఇచ్చి కమీషన్ డబ్బుతో ఆనందంగా ఇంటికెళ్ళడం ఇదీ వీరి దినచర్య. కొంతమంది వీరికి ఫైనాన్స్ కూడా ఇచ్చి ప్రోత్సహిస్తుంటారు.

చిట్టి పొట్టి  చేతులతో పుస్తకాల బ్యాగ్‌లు మోసుకెళ్ళాల్సిన వయసులో గాజులు, బట్టలు, ఆట వస్తువులు, తమలపాకులు ఇలా రకరకాల వస్తువులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు.

చార్మినార్ ను చూసి ఆనందంగా తిరిగి వెళ్ళే వారికి ఇక్కడి బాలకార్మికులను చూసి జాలి వేయకమానదు. ప్రభుత్వం స్పందించి ఈ చిన్నారులను బడిలో చేర్పించి వారి విలువైన భవిష్యత్ ను నిలబెట్టాలని స్థానికులు కోరుతున్నారు.

తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెందరో అన్నట్టు అద్భుతమైన చారిత్రక కట్టడంగా అలరారుతున్న చార్మినార్.. మాటున నగలిపోతున్న చిట్టి బతుకుల గురించి కూడా పట్టించుకుందాం. వారికి ఉజ్వలమైన భవిష్యత్తు ఇవ్వడానికి మనవంతు కృషి చేద్దాం.

స్ప్రింగ్ రంగడు


కాస్త బాగా డాన్స్ చేస్తేనే ఒంట్లో స్ప్రింగులున్నాయేమో అంటూ ఉంటాం. అలాంటిది గాల్లో పల్టీలు కొడుతూ ఇరవై ఐదు మీటర్ల దూరం జంప్ చేస్తే..... ఇది కేవలం సర్కస్ చేసే వాళ్లకో జిమ్నాస్టిక్ చేసే వాళ్లకో మాత్రమే సాధ్యం అనుకుంటాం.. నిజానికి జిమ్నాస్టిక్స్‌లో  టంబ్లింగ్ అనే అరుదైన అంశంలో  ఇలాంటి విన్యాసాలుంటాయి. పోలెండ్‌కు చెందిన జోసెఫ్ వడెక్కీ  ఇందులో నిష్ణాతుడు. అతని టంబ్లింగ్ విన్యాసాలు తాజాగా ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించాయి.

ఇటీవల ఇంటర్నెట్‌లో ఓ వీడియో బాగా ప్రాచుర్యం పొందింది. ఓ జిమ్నాస్ట్ చేసిన అద్భుత విన్యాసాలు నెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించాయి. ఇదంతా నిజం కాదంటూ కామెంట్లూ వచ్చాయి. అయితే ఆ ఫీట్ చేసిన పోలెండ్ క్రీడాకారుడు జోసెఫ్ వడెక్కి ఇప్పుడు హాట్ టాపిక్...

ఇతడి పేరు జోసెఫ్ వడెక్కి . పోలెండ్ దేశస్థుడు. తనకంటూ ఓ ఇమేజ్ ఉండాలని తాపత్రయపడే ఔత్సాహికుడు. నలుగురు నడిచిన బాటలో నడిస్తే వెరైటీ ఏముంటుంది. తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలిగా... అందుకే... ఏం చేస్తే బాగుంటుందా అనుకుంటూ బుర్రకు పనిచెప్పాడు. అంతే ఓ ఐడియా తట్టింది. జిమ్మాస్టిక్స్‌లో రికార్డులు సృష్టించాలనుకున్నాడు. థంబ్లింగ్ అనే క్షిష్టమైన ప్రక్రియను ఎంచుకుని కఠోర సాధన చేయడం మొదలుపెట్టాడు. పట్టుదలతో నేర్చుకుని ఇదిగో ఇలా విన్యాసాలు చేసే స్థాయికి ఎదిగాడు.  అబ్బురపరిచే థంబ్లింగ్ ఫీట్లతో జోసఫ్ ఇంటర్నెట్‌లో హాట్ ఫేవరెట్‌గా మారాడు.

టీనేజ్‌లోనే జోసఫ్ సెన్సేషనల్ థంబ్లింగ్ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. ఈ సాహసికుడి ప్రతిభకు రికార్డులు దాసోహమయ్యాయి. 17 ఏళ్ళకే వల్డ్ ఛాంపియన్ షిప్‌లో కాంస్య పథకం ఇతడి సొంతమైంది. 2005 వల్డ్ గేమ్స్ థంబ్లింగ్ విభాగంలో విజేత జోసఫే. 2008లోనూ తన సత్తా ఏంటో చూపించాడు.

తన విన్యాసాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన జోసెఫ్ వడెక్కికి ఆ దేశంలో బ్రహ్మరథం పడుతున్నారు.

శరీరాన్ని  స్ప్రింగ్‌లా వంచుతూ అద్భుత విన్యాసాలు చేస్తున్న జోసెఫ్ వడెక్కి .....ఈ ఖ్యాతి సంపాదించేందుకు ఎంతో కష్టపడ్డాడు. తన ఇష్టాఇష్టాలను త్యాగం చేసి కఠోర సాధనచేశాడు.

ఇప్పటికే పలు ఛాంపియన్‌షిప్‌లు సాధించిన జోసెఫ్‌కు... ప్రతి పోటీలోనూ చైనా జపాన్ దేశాలకు చెందిన క్రీడాకారులతో గట్టి పోటీ ఎదుర్కొన్నాడు. తను సాధించిన విజయాలకు.. కఠోర శ్రమ నిరంతర శిక్షణ నైపుణ్యాలే కారణమంటాడు జోసెఫ్‌.

25 మీటర్ల తంబ్లింగ్ ట్రాక్ పై మెలికలు తిరుగుతూ... గిరికీలు కొడుతూ... గాల్లో తేలుతూ... కళ్లుమూసి తెరిచేలోపు తాను అనుకున్న ఫీట్‌ను అద్భుతంగాచేసి ఔరా అనిపించుకోవడం జోసెఫ్‌కు అలవాటైపోయింది.అందుకే జోసెఫ్ ఫీట్‌కు జనాలు నీరాజనం పడుతున్నారు. ఇంటర్నెట్‌లో వచ్చిన జోసెఫ్ వీడియో‌కు ఫాలోయింగ్ పెరిగింది. మనోడి కోసం వెబ్‌సైట్ లో వెతకడం మొదలెట్టారు. యూట్యూబ్‌లో పోస్ట్ అయిన ఇతడి వీడియోని దాదాపు 60 లక్షల మంది వీక్షించారంటేనే అర్ధం చేసుకోవచ్చు మనోడి విన్యసాలకు ఎంతగా పులకించిపోతున్నారో....

తంబ్లింగ్‌లో విజేతగా నిలవాడానికి జోసెఫ్ చాలా కష్టపడ్డాడు. పచ్చిక బయళ్ళపై కఠోరసాధన చేశాడు. లక్ష్యాన్ని చేరుకోవాలనే తపనతో నిరంతరం శ్రమించాడు. సరదాగా కాలేజికెళ్ళి చదువుకోవాల్సిన వయసులో చదువు స్నేహం అన్నీ పక్కనపెట్టి ప్రాక్టీస్ చేశాడు. తన కలను సాకారం చేసుకున్నాడు.

అతి తక్కువ వయసులోనే ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న జోసెఫ్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.

విల్లులా వంగే ఒళ్ళు... మెరుపులా కదిలే చాకచక్యం... రెప్పపాటు కాలంలో అబ్బురపరిచే విన్యసాలు వారెవ్వా ఏంఉంది గురూ... అని అనకుండా ఉండలేని నైపుణ్యాన్ని ఆ క్రీడలో చూడవచ్చు . అదే తంబ్లింగ్. థండర్ పర్ఫామెన్స్‌తో అద్భుతాలు చేయాలని ఆటగాళ్ళు కలలుకనే క్రీడ ఇది.  అసలు తంబ్లింగ్ అంటే ఏమిటి?

తంబ్లింగ్ ఈ మధ్య ప్రాచుర్యం పొందుతున్న క్రీడ. నిజానికి తంబ్లింగ్ అనేది జిమ్నాస్టిక్స్‌లో ఓ ప్రక్రియ. ఆక్రోబాటిక్ స్పోర్ట్స్ లో ఓ విభాగం. ఇందులో  25 మీటర్ల ట్రాక్‌పై  జంప్ చేయాల్సి ఉంటుంది. ఇందులో కాళ్ళు చేతులు మాత్రమే ట్రాక్‌‌కు తాకే చాయిస్ ఉంటుంది.


తంబ్లింగ్ లో ప్రాథమికంగా పంచ్ ఫ్రంట్స్, బ్యాక్ టక్స్, బ్యాక్ హ్యండ్‌స్ప్రింగ్స్, రౌండ్‌ఆఫ్స్ డబుల్‌ఫుల్స్ లాంటి విభాగాలుంటాయి. ఇందులో పురుషుల, మహిళల విభాగాల్లో పోటీ ఉంటుంది. తంబ్లింగ్‌లో 3 పాసులుంటాయి. పాసు అనగా తంబ్లింగ్‌లో  ఓ క్రీడాకారుడు ఒకసారి ప్రదర్శించే కొన్ని అంశాలు.


 మనదేశంలోనూ ఇప్పుడిప్పుడే ఈ క్రీడపై అవగాహన పెరుగుతోంది. ఆటగాళ్ళకు సరైన సదుపాయాలు కల్పించి ప్రోత్సహిస్తే...మనవాళ్లు తమ ప్రతిభను చాటుకుంటారు.

ఇదీ సూపర్ ఫీట్ల తంబ్లింగ్ జిమ్నాస్ట్‌పై స్పెషల్ ఫోకస్....మరో ఫోకస్‌లో మళ్లీకలుద్దాం...