నా భావాలు మీతో పంచుకోవాలనే ఈ చిన్ని ప్రయత్నం

నా భావాలు మీతో పంచుకోవాలనే ఈ చిన్ని ప్రయత్నం

Sunday, 17 April 2011

స్ప్రింగ్ రంగడు


కాస్త బాగా డాన్స్ చేస్తేనే ఒంట్లో స్ప్రింగులున్నాయేమో అంటూ ఉంటాం. అలాంటిది గాల్లో పల్టీలు కొడుతూ ఇరవై ఐదు మీటర్ల దూరం జంప్ చేస్తే..... ఇది కేవలం సర్కస్ చేసే వాళ్లకో జిమ్నాస్టిక్ చేసే వాళ్లకో మాత్రమే సాధ్యం అనుకుంటాం.. నిజానికి జిమ్నాస్టిక్స్‌లో  టంబ్లింగ్ అనే అరుదైన అంశంలో  ఇలాంటి విన్యాసాలుంటాయి. పోలెండ్‌కు చెందిన జోసెఫ్ వడెక్కీ  ఇందులో నిష్ణాతుడు. అతని టంబ్లింగ్ విన్యాసాలు తాజాగా ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించాయి.

ఇటీవల ఇంటర్నెట్‌లో ఓ వీడియో బాగా ప్రాచుర్యం పొందింది. ఓ జిమ్నాస్ట్ చేసిన అద్భుత విన్యాసాలు నెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించాయి. ఇదంతా నిజం కాదంటూ కామెంట్లూ వచ్చాయి. అయితే ఆ ఫీట్ చేసిన పోలెండ్ క్రీడాకారుడు జోసెఫ్ వడెక్కి ఇప్పుడు హాట్ టాపిక్...

ఇతడి పేరు జోసెఫ్ వడెక్కి . పోలెండ్ దేశస్థుడు. తనకంటూ ఓ ఇమేజ్ ఉండాలని తాపత్రయపడే ఔత్సాహికుడు. నలుగురు నడిచిన బాటలో నడిస్తే వెరైటీ ఏముంటుంది. తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలిగా... అందుకే... ఏం చేస్తే బాగుంటుందా అనుకుంటూ బుర్రకు పనిచెప్పాడు. అంతే ఓ ఐడియా తట్టింది. జిమ్మాస్టిక్స్‌లో రికార్డులు సృష్టించాలనుకున్నాడు. థంబ్లింగ్ అనే క్షిష్టమైన ప్రక్రియను ఎంచుకుని కఠోర సాధన చేయడం మొదలుపెట్టాడు. పట్టుదలతో నేర్చుకుని ఇదిగో ఇలా విన్యాసాలు చేసే స్థాయికి ఎదిగాడు.  అబ్బురపరిచే థంబ్లింగ్ ఫీట్లతో జోసఫ్ ఇంటర్నెట్‌లో హాట్ ఫేవరెట్‌గా మారాడు.

టీనేజ్‌లోనే జోసఫ్ సెన్సేషనల్ థంబ్లింగ్ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. ఈ సాహసికుడి ప్రతిభకు రికార్డులు దాసోహమయ్యాయి. 17 ఏళ్ళకే వల్డ్ ఛాంపియన్ షిప్‌లో కాంస్య పథకం ఇతడి సొంతమైంది. 2005 వల్డ్ గేమ్స్ థంబ్లింగ్ విభాగంలో విజేత జోసఫే. 2008లోనూ తన సత్తా ఏంటో చూపించాడు.

తన విన్యాసాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన జోసెఫ్ వడెక్కికి ఆ దేశంలో బ్రహ్మరథం పడుతున్నారు.

శరీరాన్ని  స్ప్రింగ్‌లా వంచుతూ అద్భుత విన్యాసాలు చేస్తున్న జోసెఫ్ వడెక్కి .....ఈ ఖ్యాతి సంపాదించేందుకు ఎంతో కష్టపడ్డాడు. తన ఇష్టాఇష్టాలను త్యాగం చేసి కఠోర సాధనచేశాడు.

ఇప్పటికే పలు ఛాంపియన్‌షిప్‌లు సాధించిన జోసెఫ్‌కు... ప్రతి పోటీలోనూ చైనా జపాన్ దేశాలకు చెందిన క్రీడాకారులతో గట్టి పోటీ ఎదుర్కొన్నాడు. తను సాధించిన విజయాలకు.. కఠోర శ్రమ నిరంతర శిక్షణ నైపుణ్యాలే కారణమంటాడు జోసెఫ్‌.

25 మీటర్ల తంబ్లింగ్ ట్రాక్ పై మెలికలు తిరుగుతూ... గిరికీలు కొడుతూ... గాల్లో తేలుతూ... కళ్లుమూసి తెరిచేలోపు తాను అనుకున్న ఫీట్‌ను అద్భుతంగాచేసి ఔరా అనిపించుకోవడం జోసెఫ్‌కు అలవాటైపోయింది.అందుకే జోసెఫ్ ఫీట్‌కు జనాలు నీరాజనం పడుతున్నారు. ఇంటర్నెట్‌లో వచ్చిన జోసెఫ్ వీడియో‌కు ఫాలోయింగ్ పెరిగింది. మనోడి కోసం వెబ్‌సైట్ లో వెతకడం మొదలెట్టారు. యూట్యూబ్‌లో పోస్ట్ అయిన ఇతడి వీడియోని దాదాపు 60 లక్షల మంది వీక్షించారంటేనే అర్ధం చేసుకోవచ్చు మనోడి విన్యసాలకు ఎంతగా పులకించిపోతున్నారో....

తంబ్లింగ్‌లో విజేతగా నిలవాడానికి జోసెఫ్ చాలా కష్టపడ్డాడు. పచ్చిక బయళ్ళపై కఠోరసాధన చేశాడు. లక్ష్యాన్ని చేరుకోవాలనే తపనతో నిరంతరం శ్రమించాడు. సరదాగా కాలేజికెళ్ళి చదువుకోవాల్సిన వయసులో చదువు స్నేహం అన్నీ పక్కనపెట్టి ప్రాక్టీస్ చేశాడు. తన కలను సాకారం చేసుకున్నాడు.

అతి తక్కువ వయసులోనే ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న జోసెఫ్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.

విల్లులా వంగే ఒళ్ళు... మెరుపులా కదిలే చాకచక్యం... రెప్పపాటు కాలంలో అబ్బురపరిచే విన్యసాలు వారెవ్వా ఏంఉంది గురూ... అని అనకుండా ఉండలేని నైపుణ్యాన్ని ఆ క్రీడలో చూడవచ్చు . అదే తంబ్లింగ్. థండర్ పర్ఫామెన్స్‌తో అద్భుతాలు చేయాలని ఆటగాళ్ళు కలలుకనే క్రీడ ఇది.  అసలు తంబ్లింగ్ అంటే ఏమిటి?

తంబ్లింగ్ ఈ మధ్య ప్రాచుర్యం పొందుతున్న క్రీడ. నిజానికి తంబ్లింగ్ అనేది జిమ్నాస్టిక్స్‌లో ఓ ప్రక్రియ. ఆక్రోబాటిక్ స్పోర్ట్స్ లో ఓ విభాగం. ఇందులో  25 మీటర్ల ట్రాక్‌పై  జంప్ చేయాల్సి ఉంటుంది. ఇందులో కాళ్ళు చేతులు మాత్రమే ట్రాక్‌‌కు తాకే చాయిస్ ఉంటుంది.


తంబ్లింగ్ లో ప్రాథమికంగా పంచ్ ఫ్రంట్స్, బ్యాక్ టక్స్, బ్యాక్ హ్యండ్‌స్ప్రింగ్స్, రౌండ్‌ఆఫ్స్ డబుల్‌ఫుల్స్ లాంటి విభాగాలుంటాయి. ఇందులో పురుషుల, మహిళల విభాగాల్లో పోటీ ఉంటుంది. తంబ్లింగ్‌లో 3 పాసులుంటాయి. పాసు అనగా తంబ్లింగ్‌లో  ఓ క్రీడాకారుడు ఒకసారి ప్రదర్శించే కొన్ని అంశాలు.


 మనదేశంలోనూ ఇప్పుడిప్పుడే ఈ క్రీడపై అవగాహన పెరుగుతోంది. ఆటగాళ్ళకు సరైన సదుపాయాలు కల్పించి ప్రోత్సహిస్తే...మనవాళ్లు తమ ప్రతిభను చాటుకుంటారు.

ఇదీ సూపర్ ఫీట్ల తంబ్లింగ్ జిమ్నాస్ట్‌పై స్పెషల్ ఫోకస్....మరో ఫోకస్‌లో మళ్లీకలుద్దాం...



No comments:

Post a Comment