స్ప్రింగ్ లాంటి ఒళ్ళు గాలిలో మైమరపించే ఫీట్లు, అబ్బురపరిచే విన్యాసాలు, కళ్ళు తిప్పుకోనివ్వని ప్రదర్శన, విన్యాసాలు చూసిన వారెవరైనా.... ప్రశంసించకుండా ఉండలేని నైపుణ్యం వారి సొంతం. అదే సర్కస్....
సర్కస్... ఈ మాట వినగానే పెద్దవాళ్లు కూడా చిన్నపిల్లలవుతారు. ఒక్కసారిగా చిన్ననాటి సంగతులు గుర్తుకొస్తాయి. సర్కస్‌లో పులులు, సింహాలు, ఏనుగులు, కోతులు, ఎలుగుబంట్లు చేసే వినోదం మన కళ్లముందు కదలాడుతుంది. ఆ సంగతులన్నీ అప్పుడప్పుడు మన పిల్లలతోనూ పంచుకుంటాం. అలాంటి సర్కస్ మన ఊరికో... నగరానికో వస్తే సర్కస్‌ను చూపించడం కోసం ఎంతో ఉబలాటపడతాం.
అప్పటికి ఇంతగా సామాజిక స్పృహ లేకపోవడంతో సర్కస్‌లలో జంతువులను విరివిగా ఉపయోగించేవారు. అప్పటి సర్కస్‌కు ఇప్పటి సర్కస్‌కు చాల వ్యత్యాసం ఉంది. అప్పడు సర్కస్ అంటే కేవలం జంతువుతో వివిధ రకాల విన్యాసాలు చేయించే వారు. వాటిని చూసిన ప్రేక్షకులు ఉబ్బితబ్బిబ్బయ్యేవారు. అయితే ఇదంతా గతం. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.
సర్కస్‌లలో జంతువుల వినియోగంపై జంతు సంరక్షణ సంఘాలు ఆందోళనలు నిర్వహించడంతో....
కొన్నేళ్ళుగా సర్కస్‌లలో మూగజీవాలను నిషేధించారు. దీంతో సర్కస్ కళ తప్పింది. ప్రేక్షకుల ఆదరణా కొరవడింది. దేశ వ్యాప్తంగా సుమారు 100కు పైగా ఉన్న సర్కస్ కంపెనీలు ప్రస్తుతం 20కి పడిపోయాయి. సర్కస్‌కు పూర్వ వైభవం తెచ్చేందుకు సర్కస్ కంపెనీలు కొత్త మార్గాలను అన్వేషించాయి.
విదేశీ కళాకారులను రప్పించి సందర్శకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే తాజాగా సుప్రీంకోర్టు 14 ఏళ్ళ పిల్లలను కూడా నిషేదించడంతో అతి తక్కువ కాలంలోనే ఈ కళ కనుమరుగయ్యే అవకాశాలున్నాయని నిర్వహకులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు సర్కస్‌లో పనిచేసే కళాకారులను ప్రభుత్వం గుర్తించడం లేదని కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రదర్శనల నిమిత్తం దేశం మొత్తం తిరుగుతుండటంతో తమకు స్థిరమైన నివాసం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొట్టచేతబట్టుకొని దేశాలు తిరిగేతాము కనీసం కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు కూడా వీలు లేకుండా పోతోందని కళాకారులంటున్నారు. ఎందుకంటే వీరికి సరైన నివాస దృవ పత్రాలు లేక కనీసం సెల్‌ఫోన్ సిమ్ కార్డు కూడా కొనుక్కోలేని పరిస్థితి.
తరతరాలుగా కొంతమంది గారడీ విద్యలు ప్రదర్శిస్తూ పొట్టపోసుకోవడం తెలిసిందే... ఇలాంటి కళలను ప్రభుత్వాలు ఆదరించకపోవడం. వంశపారపర్యంగా ఇదే వృత్తిని కొనసాగించడం లాంటి కారణాలతో ముఖ్యంగా పిల్లలు చిన్న వయసులోనే సర్కస్‌లో భాగమైపోతున్నారు.
దీంతో పిల్లల హక్కులను కాపాడాలంటూ బచ్‌పన్ బచావో ఆందోళన్ అనే స్వచ్ఛంద సంస్ధ దాఖలు చేసిన పిటిషన్ మేరకు సర్కస్ కంపెనీల్లో చిన్నారులచేత విన్యాసాలు చేయించండంపై సుప్రీంకోర్టు నిషేధం విదించింది. సర్కస్ లో పనిచేస్తున్న పిల్లలను రక్షించి వారికి పునరావాసం కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాలబాలికల ప్రాథమిక హక్కులను కాపాడాలని తన తీర్పులో పేర్కొంది. సర్కస్ కంపెనీల్లో చిన్నారుల నియామకంపై నిషేదం విధిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మరోవైపు నిర్వహకులు మాత్రం చిన్న వయసులోనే పిల్లలకు సర్కస్ విన్యాసాలు నేర్పించడం సాధ్యమవుతుందని అంటున్నారు. సర్కస్ విన్యాసాల్లో నైపుణ్యం సాధించేందుకు 9 ఏళ్ళ వయసు సరియైనదని అంటున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దృష్ట్యా 14 సంవత్సరాలు నిండిన పిల్లలకు శిక్షణనివ్వడం కుదరదని నిర్వహకులు అంటున్నారు.
పిల్లలు చదువుతోపాటు, విన్యాసాలు నేర్చుకునేందుకు వీలుగా జిమ్నాస్టిక్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కళాకారులు కోరుతున్నారు. అయితే తాజ తీర్పుతో సర్కస్‌లలో పనిచేస్తున్న పిల్లలు బడిబాట పడతారని ఆశిద్దాం...
